Monthly Archives: November 2015

  jakranpally_airport

  జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు ఎక్కడ!?
  ఆశలు రేకెత్తిస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల ప్రకటన
  కొన్నేళ్ల క్రితమే జక్రానపల్లిలో స్థలం గుర్తింపు
  అనువు కాదని తేల్చిన విమానయాన శాఖ
  మరి ఎయిర్‌పోర్టు ఎక్కడో సర్కారు తేల్చేనా!?
  జిల్లావాసుల ఆశలు నెరవేరేనా!?
  జిల్లావాసుల ఆశలన్నీ మరోసారి మబ్బుల్లో విహరిస్తున్నాయి. విమానాశ్రయం ఏర్పాటు అంశం ప్రతీసారి తెరమీదకు వస్తున్నప్పటికీ.. అసలు జిల్లాలో ఏర్పాటవుతుందా!? లేదా!? అన్న అనుమానం మాత్రం జనాన్ని పట్టి పీడిస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నిజామాబాద్‌లో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయడానికి పౌర విమానయాన శాఖ అంగీకరించినట్టు ప్రకటించడంతో.. మళ్లీ ఒక్కసారిగా ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. 2008లోనే జక్రాన్‌పల్లి శివారులో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా.. పలు కారణాల రీత్యా తిరస్కరించారు. తాజాగా మంత్రి తుమ్మల ప్రకటనతో.. ఎయిర్‌పోర్టుకు స్థలం ఎక్కడ గుర్తిస్తారో, ఎప్పుడు ఏర్పాటు అవుతుందో తదితర విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
  ఆర్మూర్‌: జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అంశం ప్రతీసారి తెరమీదకు వస్తున్నప్పటికీ, అసలు జిల్లాలో ఏర్పాటవుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రతీసారి ఆశలు రేకెత్తడం, ఆ తర్వాత ఏదో కారణంతో ఆశలు సన్నగిల్లడం జరుగుతోంది. తాజాగా రాష్ట్రమంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావు నిజామాబాద్‌, వరంగల్‌లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి పౌర విమానయాన శాఖ అంగీకరించినట్టు ప్రకటించారు. పౌర విమానయాన శాఖ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు అంగీకరించడం ఇది కొత్తకాదు. 2008లోనే అంగీకరించింది. కానీ స్థలం విషయంలో కొర్రీలు పెట్టింది. 2008లో జిల్లాకు విమానాశ్రయం ప్రకటించగానే అప్పటి జక్రాన్‌పల్లి ఎంపీపీ అనంత్‌రెడ్డి, మాజీమంత్రి సంతోష్‌రెడ్డి ద్వారా తమ మండలంలో అనువైన భూమి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. దీంతో అధికారులు జక్రాన్‌పల్లిలో విమానాశ్రయానికి సుమారు రెండు వేల ఎకరాల భూమిని గుర్తించారు. అదే సంవత్సరం మార్చి 11న సంబంధిత అధికారులు సంబంధిత స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా ఉందని ప్రకటించా రు. తర్వాత ఈ స్థలం అనువుగా లేదనే ఉద్దేశంతో విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని మరుగున పడేశారు.
  ఆశలు రేకెత్తించిన మరో విమానయాన సంస్థ
  ఆ తర్వాత మరో సంస్థ స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా ఉందని ప్రకటించడంతో ఆశలు రేకెత్తాయి. గ్రీన్‌ ఫీల్డ్‌ సంస్థ విమానాశ్రయం అభివృద్ధికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండో వారంలో జక్రాన్‌పల్లి స్థలం అనువుగా లేదని, జిల్లా కేంద్రానికి సమీపంలో మరో స్థలాన్ని గుర్తించాలని కేంద్ర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హకీంపేట్‌, కర్నాటకలోని బీదర్‌ ఎయిర్‌ఫోర్స్‌ల నుంచి శిక్షణ విమానాలు ఈ ప్రాంతం మీదుగానే సంచరిస్తాయని, ఎయిర్‌ ట్రాఫిక్‌జాం అయ్యే అవకాశముందని విమానయాన శాఖ పేర్కొంది. దీంతో జక్రాన్‌పల్లిలో ఏర్పాటుపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి.
  జిల్లాలో అనువైన స్థలం కరువు
  విమానాశ్రయం ఏర్పాటుకు జిల్లాలో అనువైన స్థలంలేదు. హకీంపేట్‌, బీదర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ల నుంచి శిక్షణ విమానాలు ఈ ప్రాంతంలో సంచరించడం వల్ల ఇబ్బందులెదురవుతాయనే ఉద్దేశంతో జక్రాన్‌పల్లి స్థలాన్ని తిరస్కరించారు. బీదర్‌, హకీంపేట్‌ ఎయిర్‌స్టేషన్‌లకు ఇంతకంటే దూరమైన స్థలం జిల్లాలో మరో చోట లేదు. సారంగపూర్‌, మంచిప్ప, కామారెడ్డిరోడ్‌లు బీదర్‌, హకీంపేట్‌కు మరింత దగ్గరవుతాయి. జక్రాన్‌పల్లి నుంచి మరికొంత దూరం వెళ్లితే జిల్లా సరిహద్దు ముగుస్తుంది. అంతేగాక సరిహద్దులో అనుకూలంగా లేదు. మరోచోట అనువైన స్థలం గుర్తించడం, సేకరించడం పెద్ద సమస్య కానుంది. ప్రతిపాదిత స్థలం జిల్లా కేంద్రానికి కేవలం 22కిలోమీటర్ల దూరంలో ఉంది.
  ఆర్మూరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో, ఉత్తర, దక్షిణ భారతదేశాలను కలిపే జాతీయరహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్మూరు రైల్వేస్టేషన్‌, 63వ నెంబర్‌ జాతీయరహదారి, తెలంగాణ విశ్వవిద్యాలయం దగ్గరలో ఉన్నాయి. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దులు కూడా దగ్గరగా ఉన్నాయి. ముఖ్యంగా భూమి అందుబాటులో ఉంది. 2008లో జక్రాన్‌పల్లి, అర్గుల్‌, తొర్లికొండ, మనోహరాబాద్‌, కొలిప్యాక్‌ గ్రామాల శివారులో సుమారు రెండు వేల ఎకరాలు గుర్తించారు. ఇందులో 12వందల ఎకరాలు అసైన్‌మెంట్‌ భూమి. సుమారు 800 ఎకరాలు పట్టా భూమి. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ స్థలాన్ని తిరస్కరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటన నేపథ్యంలో జిల్లాలో విమానాశ్రయం మళ్ళీ తెరమీదకు వచ్చినప్పటికీ, ఎక్కడ స్థలం గుర్తిస్తారో? ఎప్పుడు ఏర్పాటవుతుందో? వేచిచూడాల్సిందే..!!